కరోనా మరోసారి భయపెడుతోంది. మూడేళ్ల నుంచి వివిధ రూపాల్లో ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోసారి చైనా దేశం కరోనాతో అల్లాడుతుంది. భారీగా కేసులు పెరుగుతుండం ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారికంగా ప్రకటించకపోయిన చైనాలో భారీగా కరోనా మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారత్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు మూడు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందుగానే వైరస్ ను అడ్డుకునేందుకు చర్యలను ప్రారంభించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ తో పాటు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించనుంది. ప్రస్తుతం తెలంగాణలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 10లోపు మాత్రమే ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..జాగ్రతలు పాటించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది.