ind-nz 3rd odi: కోహ్లీ కోసం వికెట్ త్యాగం చేసిన ఇషాన్ కిషన్..
భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఊహించని రీతిలో ఇషాన్ కిషన్ రనౌటయ్యాడు. మెరుపు సెంచరీలు సాధించి రోహిత్, గిల్ జోడి ఔటయ్యాక విరాట్, ఇషాన్ కిషన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఆచితూచి ఆడుతూ నిలదొక్కుకునే సమయంలో ఇషాన్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. నిజానికి విరాట్ ఔట్ కావాల్సి ఉండగా..అతడి కోసం ఇషాన్ తన వికెట్‌ను త్యాగం చేశాడు.
జాకబ్ వేసిన 35 ఓవర్ మూడో బంతిని ఇషాన్ డిఫెన్స్ ఆడాడు..మొదట సింగిల్ పూర్తవుతుందని భావించి క్రీజ్ వదిలి పరుగుపెట్టాడు..ఈ లోపు ఫీల్డర్ చేతికి బంతి దొరకడంతో మనస్సు మార్చుకొని వెనక్కు వెళ్లిపోయాడు. ఇంతలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న కోహ్లీ రన్ కోసం వచ్చేయడంతో ఇద్దరూ స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉండిపోవాల్సి వచ్చింది.బంతిని అందుకున్న డఫ్పీ, నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేయడంతో లేటుగా క్రీజులోకి వెళ్లిన ఇషాన్ కిషన్‌ను అవుట్‌గా ప్రకటించారు. అయితే విరాట్ కోసమే తన వికెట్‌ను త్యాగం చేసినట్లు ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. పెద్ద బ్యాట్స్‌మెన్ కోసం వికెట్ త్యాగం చేసిన ఇషాన్ కొందరు ప్రశంసిస్తుంటే..లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకోవడం ఎందుకని విమర్శిస్తున్నారు.