ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలిరోజు ముగిసింది. ఆసీస్ ఆలౌట్ అయ్యాక మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీంఇండియా మెదటిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(56*) అర్థసెంచరీతో అలరించాడు. మరోసారి కేఎల్ రాహుల్ (20) నిరాశపరిచాడు. తొలిరోజు ఆట చివరిలో మర్ఫీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం నైట్ వాచ్ మెన్‌గా వచ్చిన అశ్విన్..రోహిత్‌తో పాటు క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆరంభంలోనే రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కంగారులు తర్వాత భారత్ స్పిన్‌ను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. రవీంద్ర జడేజా(5/47), అశ్విన్ (3/42) ఆస్ట్రేలియాను కోలుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ప్రధానంగా గాయం నుంచి కోలుకున్న జడేజా విజృంభించాడు. ఐదు కీలక వికెట్లను తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. తర్వాత తోకను కట్ చేసే పనిని అశ్విన్ తీసుకున్నాడు. ఆరంభంలో సిరాజ్, షమీ ఓపెనర్లు ఔట్ చేసి మానసికంగా దెబ్బకొట్టారు. ప్రస్తుతం ఆసీస్ కంటే భారత్ 100 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ ఇదే ఫామ్‌ను కొనసాగించడంతో పాటు మిగిలిన బ్యాటర్లు రెండో రోజు నిలబడితే భారీ ఆధిక్యం సంపాదించి మ్యాచ్‌పై పట్టుసాధించవచ్చు.