ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అనూహ్యంగా రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. భారత్ బౌలింగ్ ఎటాక్‌లో గాయపడిన ఈ ఆసీస్ ఓపెనర్ మొదటి ఇన్నింగ్స్ అయ్యాక కనిపించలేదు. ముఖ్యంగా సిరాజ్ వేసిన రాకాసి బౌన్సర్లు వార్నర్‌ను ఇబ్బంది పెట్టాయి. ఓ బంతి అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వార్నర్ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన వార్నర్.. ఫిజియోతో ట్రీట్ మెంట్ తీసుకుని తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. తర్వాత కూడా సిరాజ్ విసిరిన మరిన్ని బౌన్సర్లు హెల్మెట్‌ను బలంగా తాకాయి. అయినా మొండిగా క్రీజ్‌లో నిలబడి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. చివరికి షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 44 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 15 పరుగులు చేశాడు. తర్వాత భారత బ్యాటింగ్ చేసిన సమయంలో వార్నర్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడు బౌన్సర్లు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు జట్టు ప్రతినిధి వెల్లడించారు. వాంతులు కూడా చేసుకున్నట్లు తెలిపాడు. ఇక వార్నర్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్‌షా బరిలోకి దిగాడు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రేన్‌షాకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గాయం కారణంగా బౌలర్స్ స్టార్క్, హేజిల్ వుడ్ వంటి జట్టుకి దూరంకాగా ఇప్పుడు వార్నర్ వంటి స్టార్ బ్యాటర్ కూడా గాయానికి గురికావడం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.