ఆస్ట్రేలియాతో ఆఖరి పోరాటానికి సిద్ధమైన టీమ్‌ ఇండియా - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాతో ఆఖరి పోరాటానికి సిద్ధమైన టీమ్‌ ఇండియా

March 9, 2023

IND VS AUS 4th Test: PM Narendra Modi and Anthony Albanese To Toss The Coin

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆసీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్ట్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఇండోర్ టెస్ట్‌లో ఇండియాను చిత్తు చేసిన ఆసీస్ అదే జోరులో ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ రానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఆస్ట్రేలియా ఇప్పటికే అర్హత సాధించగా మరో బెర్త్‌ కోసం భారత్‌, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఫలితంతో సంబంధం లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ దూసుకెళ్తుంది. ఒకవేళ భారత్‌, ఆసీస్‌ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయి.. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తే టీమ్‌ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు గల్లంతవుతాయి. కానీ, కివీస్‌తో లంకేయులు క్లీన్ స్వీప్ చేయకుండా అంతకంటే తక్కువ తేడాతో విజయం సాధిస్తే భారత్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్‌ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే.. శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ది ఓవెల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించనున్నారు.

IND VS AUS 4th Test: PM Narendra Modi and Anthony Albanese To Toss The Coin

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో చివరిదైన ఈ టెస్ట్ మ్యాచ్‌ తొలిరోజు లక్ష మంది వరకు ప్రేక్షకులు వస్తారని అంచనా. ఇరుదేశాల ప్రధానులు హాజరుకానున్న వేళ 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా కేంద్రబలగాలు కూడా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

జట్ల అంచనా

భారత్‌: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజార, కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, జడేజా, భరత్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, షమీ, ఉమేశ్‌యాదవ్‌/సిరాజ్‌

ఆస్ట్రేలియా: స్మిత్‌(కెప్టెన్‌), హెడ్‌, ఖవాజ, లబుషేన్‌, హ్యాండ్స్‌కోంబ్‌, గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లియాన్‌, కునెమన్‌.