అహ్మదాబాద్ ను పరుగుల సునామీ ముంచెత్తింది. ఇండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ బౌండరీల వర్షంతో మైదానం తడిసి ముద్దైంది. ఈ సిరీస్ లో వరుసగా రెండు విఫలమైన గిల్ ఈ మ్యాచ్ లో పూనకం వచ్చినట్టు రెచ్చిపోయాడు. 63 బంతుల్లో 126 నాటౌట్ గా నిలిచి 12 ఫోర్లు, 7 సిక్సర్లు కదం తొక్కాడు. అంతర్జాతీయ టి20ల్లో గిల్ కు ఇదే తొలి శతకం. ఓవరాల్ గా భారత్ నుంచి అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 7వ ప్లేయర్ గా నిలిచాడు. 187.04 స్ట్రయిక్ రేట్ తో గిల్ శతక్కొట్టాడంటే అతని వబ్యాటింగ్ ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చును. సెంచరీ చేశాక నెమ్మదిస్తాడనుకుంటే తర్వాత కూడా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిపోయాడు. సెంచరీ తర్వాత గిల్ ఆడియన్స్ వైపు చూస్తూ అభివాదం చేశాడు.
ఇక సిరీస్ విజేతను తేల్చే మూడో టి20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది.న్యూజిలాంగ్ కు భారత్ భారీ టార్గెట్ నే ఇచ్చింది. న్యూజిలాండ్ దీన్ని ఎలా ఎదుర్కుంటుందో రెండో ఇన్నింగ్స్ లో చూడాలి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలం అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి భారత స్కోరు బోర్డును శుబ్ మన్ గిల్ పరిగెత్తించాడు. త్రిపాఠి ఉన్నంత సేపు ధనాధన్ షాట్లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశ పరిచాడు. సూర్య కుమార్ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 30 రన్స్ చేశాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తీసుకున్నారు.