IND vs NZ 3rd T20 match in Napier, 12 PM On Tuesday
mictv telugu

నేడే ఆఖరి టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్

November 22, 2022

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరుగనున్న మూడో టీ20 మ్యాచ్‌(ఆఖరి పోరు)కి టీమిండియా సిద్ధమైంది. న్యూజిలాండ్‌లోని నేపియర్‌లో ఉన్న మెక్ లీన్‪పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో భారత్‌ 65 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకొంటుంది. ఒకవేళ ఓడినా 1-1తో సమంగా నిలుస్తుంది.

ఈ క్రమంలో భారత్ తుది జట్టులో మార్పులుంటాయని ప్రచారం జరుగుతుండగా.. భారీగా మార్పులేమీ ఉండవని ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు. తుదిజట్టులో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో పాటు బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌కు అవకాశమివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. రెండో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్వితీయ, విధ్వంసరకర ఇన్నింగ్స్‌ కారణంగా భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. ఆఖరి మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగుతాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు. డాక్టర్ అపాయింట్‌మెంట్‌ వల్ల కేన్‌ మూడో టీ20లో ఆడలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌కు ఆ జట్టు పేసర్‌ టిమ్‌ సౌథీ సారథిగా వ్యవహరించనున్నాడు.