హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న నగరవాసులు.. ఈ మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు మ్యాచ్ ప్రారంభానికి, ముగింపు సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని తెలిపారు.
ఇక హైదరాబాద్ మెట్రో కూడా క్రికెట్ అభిమానులకు ఓ వార్త తెలిపింది. నగరవాసులు ఉప్పల్ లో జరగబోయే మ్యాచ్ కు మెట్రో ప్రయాణాన్నే ఎక్కువగా వినియోగిస్తారని తెలిసి… బుధవారం నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో నడుపుతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మెట్రో రైళ్ల రాకపోకలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఎల్అండ్టీ ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి చర్చించి, రాత్రి 9 గంటల తర్వాత రద్దీ ఉంటే అదనపు మెట్రో సేవలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్టేడియం మెట్రో స్టేషన్లో 10 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.