IND vs PAK T20 World Cup: India beat Pakistan by 4 wickets
mictv telugu

ఉత్కంఠభరిత పోరులో భారత్ ఘన విజయం

October 23, 2022

నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీమిండియా పాక్ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. టాస్‌ గెలిచి భారత సారథి రోహిత్‌ శర్మ పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌ అప్పజెప్పగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌ (52*), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51) రన్స్‌ చేయడంతో ఆ జట్టు 159 పరుగులు చేసింది.

ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బ్యాటింగ్ దిగిన భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీయగా, నసీమ్ షా ఓ వికెట్ పడగొట్టాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే సరిపెట్టుకోగా, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆల్ రౌండర్ గా న్యాయం చేస్తాడనుకుని కాస్త ముందే అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు దింపినా, అతడు చేసింది రెండు పరుగులే. లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ(82)-హార్దిక్‌ పాండ్యా(40) ఆదుకున్నారు. చివరి ఓవర్ లో పాండ్యా అవుట్ అవ్వడంతో గెలుపు కాస్త కష్టమే అనుకున్నారంతా. అప్పటికీ కేవలం 5 బంతులకు 16 రన్స్ చేయాల్సి ఉంది. కానీ విరాట్ తన అనుభవంతో, సమయస్ఫూర్తితో చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌ చేసిన తప్పిదాలు టీమ్‌ఇండియాకు వరంలా మారాయి.