IND vs SA, T20 World Cup 2022: Rohit Sharma wins toss, India bats first vs South Africa
mictv telugu

సఫారితో పోరుకు భారత్ సై.. టాస్ గెలిచిన టీమిండియా

October 30, 2022

టీ20 ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా.. నేడు సఫారీలతో పోరుకు సిద్ధమైంది. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. సాయంత్రం 4:30 గంటలకు పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్‌కు రానుంది.

బ్యాటింగ్ లో భారత్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లు ఉన్నా ఓపెనింగ్ సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ లలో కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో అయినా రాహుల్ ఆడతాడో లేదో చూడాలి. బ్యాటింగ్ లో జోరు మీదున్న టీమిండియా.. బౌలింగ్ లో కూడా మెరుగ్గానే ఉంది. బుమ్రా లేకున్నా భువనేశ్వర్, షమీ తో పాటు యువ అర్ష్‌దీప్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు.

సౌతాఫ్రికా ఈ టోర్నీలో జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లలో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ జోరు చూపించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రిలీ రొసోవ్ సెంచరీ బాదాడు. వీరికి తోడు మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్ లతో పాటు కేశవ్ మహారాజ్ కూడా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు.. రబాడా, ఎంగిడి, నోర్త్జ్, కేశవ్ మహారాజ్‌లతో బలంగా ఉంది. భారత బ్యాటర్లను సఫారీ బౌలింగ్ దళం ఏ మేరకు నియంత్రిస్తుందో వేచి చూడాలి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా మీద భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇరు జట్లు ఇదివరకు 5 సార్లు తలపడగా.. నాలుగు సార్లు భారత్ గెలవగా ఒక్కసారి మాత్రమే సౌతాఫ్రికా నెగ్గింది.

తుది జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా : టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రొసోవ్, మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్త్జ్, లుంగి ఎంగిడి, కగిసో రబాడా