శ్రీలంకతో తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టీమిండియా నేడు రెండో వన్డేకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మధ్యాహ్నం 1:30 గం.లకు మ్యాచ్ జరుగనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి వన్డేలో బ్యాటర్లు దుమ్ము లేపారు. లంకేయులకు చుక్కలు చూపించారు. ఫస్ట్ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మళ్లీ అదే రిపీట్ చేయాలనుకుంటోంది రోహిత్ సేన. మరోవైపు ఈ సిరీస్‌లో నిలవాలంటే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది శ్రీలంక.
మంగళవారం జరిగిన తొలి వన్డేలో సెంచరీతో చెలరేగాడు విరాట్ కోహ్లీ . 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుభమన్ గిల్ వన్డే ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్ టాప్ ఆర్డర్ కుదురుకున్నట్లే కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ కూడా తన ఫేవరెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో చెలరేగేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లోనూ భారత్ ధీమాగానే కనిపిస్తోంది. బౌలర్లు మహ్మద్ సిరాజ్, షమి, ఉమ్రాన్ మాలిక్‌లు లంక బ్యాటర్లకు సమస్యలు సృష్టిస్తారని జట్టు ఆశిస్తోంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశముంది. కోల్‌కతాలో స్పిన్నర్లకు అవకాశం ఉండటంతో చాహల్, అక్షర్ కూడా ప్రభావం చూపుతారు.