తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (49 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా మరో ఓపెనర్ శుభమన్ గిల్ (97 బంతుల్లో 116, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం చేశాడు. ఆ తర్వాత రోహిత్ స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్, 13 ఫోర్లు, 8 సిక్సర్లు) లంకేయులను ఆట ఆడించాడు. మధ్యలో శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు 1 సిక్సర్) కోహ్లీకి అండగా నిలిచాడు. ఫలితంగా భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన లంక ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన టార్గెట్ ను ఛేదిస్తుందా..? అన్నది డౌటే.
ఇక ఈ మ్యాచ్ లో కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరుణరత్నె బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టగా.. ఆ బంతిని ఆపేందుకు డీప్ స్క్వేర్, మిడ్ వికెట్ ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఢీకొట్టుకోవడంతో గాయపడ్డారు. వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చారు. బండారాను స్ట్రెచర్ మీద ఆసుపత్రికి తరలించారు. మోకాలికి సంబంధించి స్కాన్ తీసిన అనంతరమే బండారా పరిస్థితి ఏంటనేది తేలుతుంది. వాండర్సే కూడా కాస్త గాయపడినప్పటికీ.. అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2) వికెట్లు తీయగా.. కసున్ రజిత(2), చమిక కరుణరత్నే (1) వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది.