శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. చివరి వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది లంక జట్టు. కాసేపటి క్రితం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలుచుకున్న టీమిండియా.. బ్యాటింగ్ కి దిగింది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ దంచి కొడుతున్నారు. 5 వ ఓవర్ లో శుభమన్ గిల్.. లాహిరు కుమార బౌలింగ్‌లో వరుసగా 4 ఫోర్లతో దుమ్ములేపాడు. రోహిత్ శర్మ కూడా అదే ఓవర్ ఒక సింగిల్, ఒక సిక్సర్ బాదాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 79 గా ఉంది.
భారత్ ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతోపాటు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. శ్రీలంక సైతం తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ధనంజయ డి సిల్వా స్థానంలో అషెన్ బండారా, దునిత్ వెల్లాలగే బదులు జెఫ్రీ వాండెర్సే బరిలోకి దిగారు.
జట్లు ఇవే..
శ్రీలంక జట్టు: అవిష్క ఫెర్నాండో, నువనిడు ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ఆషెన్ బండారా, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగ, జెఫ్రీ బాండెర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లాహిరు కుమార.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.