Independence day 2022: AP CM Jagan said politics only till election
mictv telugu

75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది.. ఏపీ సీఎం జగన్

August 15, 2022

జాతీయ జెండా మనందరి ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆనాడు వాదాలు, మార్గాలు వేరైనా స్వాతంత్య్రమే లక్ష్యంగా అందరూ పోరాడారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించి భారతీయుల గుండెగా తీర్చిదిద్దారని అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో ఇవాళ భారత్‌ అగ్రస్థానంలో ఉందని, మన దేశం దిగుమతుల నుంచి ఎగుమతులకు వేగంగా అడుగులు వేసిందని జగన్‌ అన్నారు. 150 దేశాలకు ఆహారధాన్యాలు ఎగుమతి చేయగలుగుతున్నామని వెల్లడించారు.

ఏపీలో మంత్రిమండలి నుంచి గ్రామస్థాయి వరకూ సామాజిక న్యాయం తీసుకొచ్చామని చెప్పారు సీఎం జగన్. పాలనలో సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశామని, వ్యవస్థనే మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చాక అంతా మనవారేనన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. మహిళలకు సామాజిక, రాజకీయ నియామకాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 21 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, విద్యారంగంపై రూ.53వేల కోట్లు ఖర్చు చేశామని ఏపీ సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు.