Independence India Diamond Festival from today
mictv telugu

నేటి నుంచే స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

August 8, 2022

flag

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టనుంది. మొదటగా ఈరోజు ఉదయం 11.35 గంటలకు కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు కేసీఆర్ పూలమాలలు వేసి వందనం సమర్పణ చేయనున్నారు. ఆ తరువాత సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు తిలకించి, మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక పాసులు జారీచేశామని, జిల్లాల నుంచి వచ్చేవారికి వాహన సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు. 75 మంది వైణిక విద్వాంసులతో దేశభక్తి గీతాలాపన ఉంటుందని, స్వతంత్ర సమర యోధులను తలచుకొనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ప్యూజన్‌ డ్యాన్స్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

వజ్రోత్సవ కార్యక్రమాల వివరాలు

”ఈరోజు ఉదయం 11.30 గంటలకు కేసీఆర్‌చే జాతీయ పతాకావిష్కరణ, గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాల అలంకరణ, 75 మంది వీణ కళాకారులచే వీణా వాద్య ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్యరూపకం, ప్యూజన్‌ ప్రదర్శన. లేజర్‌ షో, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రసంగం, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు ప్రారంభోపన్యాసం, కేసీఆర్‌ ప్రసంగం, వందన సమర్పణ.”