ఆస్ట్రేలియాను 188 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఆటగాళ్లు..ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. స్టార్క్ ధాటికి ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషాన్(3), కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్(1) పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజ్ లో శుభమన్ గిల్(19), కేఎల్ రాహుల్(5) ఉన్నారు. స్కోరు 9 ఓవర్లలో 33/3గా ఉంది.
సూర్యకుమార్ గోల్డెన్ డక్
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్ చివరి బంతికి ఇషాన్ కిషాన్ వికెట్ కోల్పోయింది. స్టోయినీస్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాసేపటికే కోహ్లీని ఔౌట్ చేసి స్టార్ట్ భారత్ కు షాకిచ్చాడు. విరాట్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటి బంతికే పెవిలియన్ కు చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లోనే సూర్య కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఆసీస్ ఆటగాళ్లు నేలపాలు చేయడంతో బతికిపోయాడు. లేకపోతే బారత్ మరో వికెట్ కోల్పోయేది.
ఆసీస్ 188కే
అంతకుముందు భారత్ బౌలర్లు విజృంభించడంతో కంగారులు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 129/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా కేవలం 60 పరుగుల తేడాలోనే 7 వికెట్లు కోల్పోయింది. షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా జడేజా 2, పాండ్యా, కుల్దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో 65 బంతుల్లో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్. ఇంగ్లీష్ 26, స్మిత్ 22 పరుగులు చేశారు.