ప్రాణాంతక కరోనా వైరస్‌ను మట్టుబెట్టేందుకు శాస్త్రవేత్తలు అహర్నశం పనిచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మందులు వచ్చాయి. అయితే సంతృప్తికరమైన టీకాలు, మాత్రలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాను కూడా కరోనా వైరస్ పని పడతానని ఓ తెలుగు బాలిక దూసుకొచ్చింది. వ్యాధికి చికిత్స చేసే కొత్త విధానాన్ని కూడా ఆమె ప్రతిపాదించింది. ఓ సైన్స్ పోటీలో పాల్గొని ఏకంగా 18 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నివసిస్తున్న 14 ఏళ్ల అనికా చేబ్రోల ఘనత ఇది. 2020 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచింది.
కరోనా కణంపై ఉండే కొవ్వును నియంత్రంచే మార్గాన్ని అనిక ప్రతిపాదించింది. ఇన్-సిలికో అనే ప్రక్రియ ద్వారా ఆ కొవ్వును తొలగించవచ్చని ఆమె తెలిపింది. ఈ విధానం ద్వారా కరోనా వైరస్ పైన ఉండే ప్రొటీన్ కొమ్ములకు అతుక్కుపోయే కణాలను తయారు చేయొచ్చు. కొమ్ములకు కణాలు అతుక్కుపోతే వైరస్ పని చేయదు. ఫలితంగా వైరస్‌ను నిర్మూలించి రోగిని కాపాడొచ్చు.
అంటువ్యాధులు, వైరస్, ఔషధాల తయారీ గురించి ఎంతో అధ్యయనం చేశానని, తన పరిశోధనకు గుర్తింపు లభించింనందుకు సంతోషంగా ఉందని అనిక చెప్పింది. కరోనా పేషంట్లందరూ కోలుకుని, తిరిగా సాధారణ జీవితం గడపాలన్నదే తన కోరిక అని తెలిపింది.
8వ తరగతి చదువుతున్న కనికా పరిశోధనను తొలుత ఎవరూ పట్టించుకోలేదు. ‘ఏదో స్కూల్ ప్రాజెక్టులే.. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకే చేతకానిది, ఈమెవల్ల ఏమవుతుంది?’ పెదవి విరిచారు. అయినా అనిక వెనక్క తగ్గేలేదు. పూర్తి వివరాలతో ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించి ప్రైజ్ మనీ కొట్టేసింది. అనిక చదువుల్లోనూ ముందు ఉంటుందని, చాలా విషయాలపై ఆమెకు ఆసక్తి ఉందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పారు. అనికకు సైన్స్‌తోపాటు భారతీయ సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. 8 ఏళ్లు కష్టపడి భరత నాట్యం కూడా నేర్చుకుంది.