చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఏడాది గడిచింది. అయినా ఇంకా విజయం వరించలేదు. ఉక్రెయిన్‌కి పాశ్చాత్య దేశాలు ఆయుధాలు, ఆర్ధిక వనరులు, టెక్నాలజీ సమకూర్చడమే ఇందుకు కారణమని రష్యా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో అవసరమైతే అణుదాడికి సిద్ధపడింది. ఒక్క దెబ్బతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ ఆలోచించారని సమాచారం. అయితే ఆ అణుదాడి జరగకుండా భారత్, చైనా దేశాలే రష్యాను ఆపాయని తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ రెండు దేశాలే రష్యాపై ప్రభావం చూపాయని తెలిపారు. భారత్ – రష్యాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, దశాబ్దాలుగా భారత్ ఆ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన విషయం గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం భారత్ – అమెరికా దేశాల మధ్య సానుకూల వాతావరణం ఉందని, ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో భారత్ బంధం బలపడుతోందన్నారు. జీ20 సమ్మిట్ కోసం కొద్ది రోజుల్లో భారత్ రానున్న నేపథ్యంలో బ్లింకెన్ పైవిధంగా స్పందించారు.
యుద్ధం ముగించేందుకు చైనా చొరవ
ఇక రెండో ఏడాదిలో అడుగుపెట్టిన రష్యా యుద్ధాన్ని ముగించేలా చైనా ప్రణాళిక రచించింది. పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్లను శుక్రవారం రిలీజ్ చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రష్యా పర్యటనలో పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోమ్‌ను కలిసిన తర్వాతే ఈ ప్రణాళిక బయటికి రావడం గమనార్హం. ఇరుదేశాలు ముఖాముఖి కూర్చుని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. చైనా చేసిన ప్రతిపాదనపై రష్యా.. బీజింగ్ అభిప్రాయాలను గౌరవిస్తామని తెలిపింది. వెంటనే జెలెన్ స్కీ.. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించేందుకు జిన్ పింగ్‌తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. చైనా నుంచి రష్యాకు ఆయుధాలు సరఫరా కాకుండా చూసుకోవడమే తనముందున్న లక్ష్యమని వివరించారు. దీంతో యుద్ధానికి చైనా ద్వారా ఫుల్ స్టాప్ పడవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ చైనా ప్రతిపాదనపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అందులో రష్యా బలగాల ఉపసంహరణ, ఆక్రమిత భూభాగం, రష్యాపై ఏకపక్ష ఆంక్షల తిరస్కరణ వంటి అంశాలు తమకు రుచించలేదని చెప్తున్నాయి. చైనా ప్రమాదకరమైన దేశం అనీ, బీజింగ్‌ని నమ్మడానికి వీల్లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ అనుమానం వ్యక్తం చేశారు.