2021 ఫిబ్రవరి కల్లా కరోనా చివరి దశకు - MicTv.in - Telugu News
mictv telugu

2021 ఫిబ్రవరి కల్లా కరోనా చివరి దశకు

October 18, 2020

India can control Covid-19 by early 2021 with current safety protocols Govt panel.jp

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మిగిల్చిన విషాదాలు కోకొల్లలు. ఎందరినో అన్యాయంగా బలి తీసుకుని తీరని విషాదాలను నింపింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి బడుగు బలహీన వర్గాలను ఆకలితో అలమటించేలా చేసింది. శారీరకంగా, మానసికంగా హింసించింది. దీని నుంచి త్వరగా విముక్తి లభించాలని ప్రపంచం అంతా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కోవిడ్‌ ప్రత్యేక కమిటీ ఆదివారం ప్రకటించింది. జాగ్రత్తలు అన్నీ  పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కమిటీ వెల్లడించింది. దేశంలో కరోనా తీవ్రత, అంచనాలపై కేంద్రం ఐఐటీ, ఐసీఎంఆర్‌ సభ్యులతో కొవిడ్‌-19 భారత్‌ సూపర్‌ మోడల్‌ పేరుతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ నేతృత్వం వహిస్తున్నారు.

 

ఈ విషయమై ప్రత్యేక కమిటీ ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. ‘దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అంచనాలను దాటిపోయింది. జాగ్రత్త చర్యలు పక్కాగా తీసుకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి కల్లా కరోనాను నియంత్రించవచ్చు. అయితే రానున్న శీతాకాలం, పండగల సీజన్‌ కారణంగా  కేసుల సంఖ్య మళ్లీ పెరిగే ప్రమాదం కూడా ఉంది. కావున తప్పనిసరిగా కరోనా నిబంధనలు కొనసాగించాలి. ముఖానికి మాస్క్‌లు, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా కొనసాగించాలి. 2021 ఫిబ్రవరిలో మహమ్మారి చివరి దశకు చేరుకునే నాటికి దేశంలో 1.5 కోట్ల కేసులు నమోదు అవుతాయి. ఒకవేళ మార్చిలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే.. దేశంలో కరోనా మృతుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు వరకు 25 లక్షలు దాటిపోయి ఉండేది. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా వెళ్తోంది. తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అవసరమైతేనే లాక్‌డౌన్‌ విధించాల్సిందే’ అని కమిటీ స్పష్టంచేసింది. కాగా, ఆగస్టులో కేరళాలో ఓనం నిర్వహించడంతో సెప్టెంబర్‌లో ఒకేసారి కేసుల సంఖ్య పెరగడాన్ని కమిటీ ఉటంకించింది.