రెండో వన్డేలో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిల్లోనూ విఫలమైన రోహిత్ సేన పది వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో, 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అర్థ సెంచరీలతో మ్యాచ్‌ను తొందరగానే ముగించేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది ఆస్ట్రేలియా.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమితో నిరుత్సాహానికి గురైనట్లు తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసు వికెట్లు కోల్పోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. మొదటి ఇన్సింగ్స్ లో చేసిన 117 పరుగులు చాలా తక్కవని వివరించాడు. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. విరాట్ పోరాడిన సరిపోలేదని రోహిత్ చెప్పాడు.మిచెల్ మార్ష్ పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్ ను దూరం చేశాడని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
ఇక ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ “మ్యాచ్ ఇంత తొందరగా(37 ఓవర్లలోనే) ముగుస్తుందనుకోలేదు. కొత్త బంతితో స్టార్క్ చెలరేగాడు. పిచ్ పై మొదట అంచనాకు రాలేదు. ఆరంభం నుంచే భారత్‌పై తమ ప్రణాళికలతో ఒత్తిడి పెంచాలని నిర్ణయించాం. బ్యాటింగ్‌లో హెడ్, మార్ష్ దుమ్ములేపారు. గత మ్యాచ్‌లో ఓడిపోయినా..ఈ మ్యాచ్‌లో విజయం సాధించాం” అని స్మిత్ స్పష్టం చేశాడు.