చైనాను వెనక్కి నెట్టిన భారత్.. 85,940 కరోనా కేసులు
భారత్‌ను చైనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి పుట్టిన చైనాను మించి మన దేశంలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. దీంతో చైనా రికార్డును భారత్ అధిగమించేసింది. అక్కడ ఇప్పటి వరకు 82,940 కేసులు నమోదు కాగా భారత్‌లో మాత్రం 85,940కు చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ సంఖ్య లక్షకు చేరుకునే ప్రమాదం ఉందని భయపడిపోతున్నారు.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా లక్షణాలు గుర్తించారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 85,940 గా ఉండగా మరణాలుసంఖ్య మొత్తం 2,752కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 30,153 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 53,035 మంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ వైరస్ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. ప్రధానంగా మహారాష్ట్రంలో 29,100, తమిళనాడులో 10,108,గుజరాత్ 9,991, ఢిల్లీ 8,895గా నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 1454 మందికి కరోనా సోకగా.. ఏపీలో వీరి సంఖ్య 2,157గా ఉంది.