దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఒకపక్క బడాబాబుల ఇళ్లలో తినలేనంత తిండి, మరోపక్క పూడి గుడిసెల్లో ఆకలి చావులు. రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవుల దగ్గర ఖాళీ జేబులు, విమానాల్లో తిరిగే పెదబాబుల వద్ద కోట్లకు కోట్లు. ప్రభుత్వం విధానాలు, పార్టీల నినాదాలు, ఉద్యమాలు ఏవీ ఈ పరిస్థితిని మార్చలేకపోతున్నాయి. ఇది ప్రతిపక్షాలు చేసే విమర్శ కాదు. ప్రఖ్యాత హక్కుల సంస్థ ఆక్స్ఫామ్ బయటపెట్టిన కరుకు చేదు నిజాలు. అంబానీ, ఆదానీలాంటి బిలియనీర్ల సంపద రోజురోజుకూ వేలకోట్లలో పెరిగిపోతోందని, మరోపక్క సామాన్యులు, పేదల పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోందని ఆక్స్ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మనదేశంపై ’సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో నివేదిక విడదల చేసింది. కుబేరులపై 1 నుంచి 2 శాతం పన్ను విధించిన దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొంది.
నివేదికలో ముఖ్యంశాలు..
1. భారతదేశంలోని 100 మంది కుబేరుల వద్ద రూ.54.12 లక్షల కోట్ల సంపద ఉంది. దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒక శాతం ధనవంతుల దగ్గరే ఉంది.
2. పేదల దగ్గర దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉంది.
3. దేశంలోని బిలియనీర్లలో మొదటి 100 మందిపై 2.5 శాతం పన్ను, లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను వేస్తే బడి మానేసి పిల్లలందరినీ తిరిగి చదివించవచ్చు.
4. గౌతమ్ అదానీపై పన్ను విధిస్తే వచ్చే రూ.1.79 లక్షల కోట్లతో దేశంలోని ఉపాధ్యాయులకు ఏడాది పాటు జీతం ఇవ్వొచ్చు.
5. కుబేరులపై 2 శాతం పన్ను విధిస్తే వచ్చే రూ.40,423 కోట్లతో పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలందరికీ మూడేళ్ల పాటు పోషకాహారం ఇవ్వొచ్చు.
6. దేశంలో ఇప్పుడు 119 మంది బిలియనీర్లు ఉన్నారు. 200 సంవత్సరంలో వీరి సంఖ్య 9 మాత్రమే. దేశంలో రోజూ 70 మంది మిలియనీర్లు తయారవుతున్నారు.
7. మనదేశంలో స్త్రీపురుషుల శ్రమకు దక్కే ప్రతిఫలంలో విపరీతమైన తేడా ఉంది. పురుషుడు ఒక రూపాయికి సంపాదిస్తే స్త్రీకి 63 పైసలే దక్కుతున్నాయి.