India has imposed restrictions on wheat flour exports
mictv telugu

ధరల పెరుగుదల.. గోధుమ పిండిపై ఆంక్షలు

August 25, 2022

India has imposed restrictions on wheat flour exports

దేశీయంగా పెరుగుతున్న గోధుమ పిండి ధరలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. గోధుమ పిండి ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ ఆర్ధిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగగా, ఈ మేరకు త్వరలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేయనుంది. తద్వారా దేశంలో నెలకొన్న ఆహార భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని సీసీఈఏ తెలిపింది. గతంలో గోధుమల ఎగుమతులపై భారత్ ఇలాగే ఆంక్షలు విధించింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం గోధుమలు రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే సరఫరా అవుతుంది. అయితే ఆ దేశాలు యుద్ధంలో చిక్కుకోవడంతో ఆ మేరకు సరఫరా అవటం లేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో పాటు దేశంలో కూడా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని గత మే నెలలో గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో గోధుమ పిండికి అంతర్జాతీయంగా గిరాకీ పెరిగి పిండి ఎగుమతుల్లో నాలుగు నెలల్లోనే 200 శాతం పెరుగుదల నమోదైంది. ఇప్పుడు ప్రభుత్వం పిండిపై ఆంక్షలు విధించడంతో వాటి ధరలు కూడా దేశీయంగా తగ్గి వినియోగదారులకు సరసమైన ధర వద్ద అందుబాటులోకి రానుంది.