దేశంలో ఫస్ట్.. అక్రమ వలసదారుల కోసం నిర్బంధ క్యాంప్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో ఫస్ట్.. అక్రమ వలసదారుల కోసం నిర్బంధ క్యాంప్

September 12, 2019

India ..

సర్జికల్ స్ట్రయిక్స్, నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన.. ప్రతి నిర్ణయం ఒక సంచలనం.  సంచలనాలకు మారుపేరుగా మారిన మోదీ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలోనే తొలిసారి నిర్బంధ(డిటెన్షన్) క్యాంపును నిర్మిస్తోంది. అస్సాంకు సంబంధించి గత నెల విడుదల చేసి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాబితాలో పేరులేని వారి కోసం దీన్ని నిర్మిస్తున్నారు. గువాహటికి 150 కి.మీ. దూరంలోని గోల్ పాత్రా జిల్లా మాతియా ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ క్యాంపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి ఇది పూర్తికానుంది. దాదాపు 19 లక్షల మందికి అస్సాం ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. 

క్యాంపు ఇలా.. 

ఏడు ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణం ఉన్న ఈ క్యాంపులో 3వేల మందిని నిర్బంధిస్తారు. ఐదంతస్తులు ఉన్న 14 భవనాల్లో వీరిని ఉంచుతారు. అక్రమ వలసదారుల కదిలికలను గమనించడానికి నిఘా టవర్లు కూడా ఉంటాయి. చిన్న పిల్లలున్న తల్లులు, బాలింతల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. దగ్గర్లోని స్కూళ్లలో వారికి విద్య నేర్పిస్తారు. ఈ క్యాపును రూ. 46 కోట్లతో నిర్మిస్తున్నారు. అయితే అక్రమ వలసదారులు ఎవరన్నదానిపై కేంద్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్ఆర్సీకి సంబంధించిన న్యాయప్రక్రియ ముగిశాక దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మయన్మార్ నుంచి తమ దేశానికి వచ్చిన రోహింగ్యా ముస్లింల కోసం బంగ్లాదేశ్ కూడా కొన్ని క్యాంపులను నిర్మించింది. అయితే అక్కడ జైలుపక్షుల్లా జీవిండం మినహా మరెలాంటి స్వేచ్చా లేదనే విమర్శలు ఉన్నాయి. అస్సాంలోని నిర్మిస్తున్న నిర్బంధ క్యాంపులో జనాన్ని ఉంచితే పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.