India imposes tax on oil exports
mictv telugu

చమురు ఎగుమతులపై పన్ను.. సామాన్యుడికి లాభం ఎలాగో చూడండి

July 1, 2022

దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం)లపై పన్ను విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై అదనపు ట్యాక్స్ విధిస్తున్నట్టు వెల్లడించింది. లీటరు పెట్రోల్ రూ. 6, డీజిల్ రూ. 13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు ఒక టన్నుపై రూ. 23,250 అదనపు పన్ను చెల్లించాలని ఆదేశించింది. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ. 67,425 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ డబ్బుని సామాన్యులకు సరఫరా చేసే ఇంధనంపై రాయితీకి ఉపయోగించాలని ప్రభుత్వం ఉద్దేశం. అసలు ఈ కొత్తగా ఎగుమతి పన్ను(విండ్ ఫాల్ ట్యాక్స్) ఎందుకు విధించారంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరప్ దేశాలు, అమెరికా రష్యా చమురుపై ఆంక్షలు విధించాయి. దీంతో అటు ఓపెక్ దేశాలు చమురు ధరలను పెంచేసి అత్యధిక ధరలకు చమురుని విక్రయించి లాభాలు పొందుతున్నాయి. అటు రష్యా ఆంక్షల వల్ల తన చమురుని అమ్ముకోలేకపోతోంది.

ఈ నేపథ్యంలో భారత దేశం అటు అమెరికా, ఇటు యూరప్ బెదిరింపులకు లొంగక, తన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునే ఉద్దేశంతో రష్యాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం రష్యా మార్కెటు రేటు కంటే 30 శాతం తక్కువ ధరకే మనకు చమురు సరఫరా చేస్తుంది. దీనివల్ల కలిగిన ప్రయోజనం వల్లనే ఇటీవల కేంద్రం గతంలో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగలిగింది. అయితే.. కేంద్రం తాజాగా విధించిన ఎగుమతి పన్ను ప్రస్తావన ఇక్కడ వస్తుంది. రష్యా నుంచి తక్కువకు పొందిన ముడి చమురును రిలయన్స్, వేదాంత వంటి కంపెనీలు తమ లాభం కోసం అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న ధరలకు ఆయా దేశాలకు అమ్ముకొని పెద్దఎత్తున లాభాలార్జిస్తున్నాయి. అప్పటికే కేంద్రం ఆయా చమురు సంస్థలు తమ చమురులో 50 శాతం దేశీయంగా అమ్మాలని ఆదేశించింది. మిగిలిన చమురుపైన మాత్రమే పైన పేర్కొన్న అదనపు ట్యాక్స్ విధించింది. ఇటీవల దేశంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడానికి కారణం ఇదే. అధిక లాభాలు వస్తున్నాయని ఆయా సంస్థలు విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతో దేశీయంగా కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది. కాగా, కొత్తగా పన్నులు విధించడంతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు పడిపోయాయి. రిలయన్స్ షేరు 5.75 శాతం, ఓఎన్జీసీ షేరు సుమారు 10 శాతం దాకా నష్టపోయాయి.