India 'indebted' to Manmohan Singh: Nitin Gadkari praises former PM
mictv telugu

ప్రతిపక్ష నేత, మాజీ ప్రధానిపై నితిన్ గడ్కరీ ప్రశంసలు

November 9, 2022

కాంగ్రెస్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత్‌కు కొత్త మార్గాన్ని చూపెట్టాయని, దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాయని కొనియాడారు. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ… లిబరల్ ఎకానమీ స్థాపించి ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారని, ఆ సమయంలో(1991 లో) తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానని.. మన్మోహణ్ సంస్కరణల వల్లే రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధుల్ని సమీకరించగలిగానని గుర్తుచేసుకున్నారు.

భారత్‌లో రైతులకు, పేదలకు లబ్ధి చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు గడ్కరీ. ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో చెప్పడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. అలాగే భారత్‌ ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి సాధించాలంటే మరింత మూలధన పెట్టుబడి కావాలని ఆ కార్యక్రమంలో తెలిపారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ప్రతిపక్ష నేతపై కేంద్రమంత్రి ఇలా ప్రశంసలు కురిపించడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.