దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా రెండోరోజూ కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,584 మంది వైరస్ బారిన పడ్డారు. 24 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. గురువారం 3,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
ప్రస్తుతం దేశంలో 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, రోజువారీ పాజిటివిటీ 2.26 శాతానికి చేరుకోగా.. వీక్లీ పాజిటివిటీ 1.50 శాతం దాటినట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 194.76 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. మరోవైపు, జనవరి చివరి వారం నుంచి తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత మూడు నెలలు స్థిరంగా కొనసాగాయి. కానీ, గతవారం నుంచి మాత్రం రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. 99 రోజుల తర్వాత గురువారం 7 వేలకుపైగా కేసులు రాగా.. శుక్రవారం ఇది మరింత పెరిగింది. పది రోజుల్లోనే వారం సగటు రెట్టింపయ్యింది.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్ర(2,813), కేరళ(2,193)లోనే ఐదు వేలకు పైగా కేసులొచ్చాయి. ఢిల్లీ(622)లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు విస్తరిస్తుండటంతో కేంద్రం స్థానిక ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది.