India lost to New Zealand in the first ODI
mictv telugu

భారత్ పై న్యూజిలాండ్ విజయం

November 25, 2022

India lost to New Zealand in the first ODI

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఓటమి చవిచూసింది. 307 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక పరాజయం పాలైంది. లాథమ్ దూకుడు, విలియమ్సన్ క్లాస్ ఇన్నింగ్స్‌లు భారత్‌‌కు విజయాన్ని దూరం చేశాయి. లాథమ్ 145 పరుగులతో చెలరేగగా, విలియమ్సన్ 94 పరుగులతో రాణించాడు.మరో 17 బంతులుండగానే వీరిద్దరు మ్యాచ్‌ను ముగించారు. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి కేవలం 47.1 ఓవర్లలోనే చేధించారు. లక్ష్య చేధనలో 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడి ఆదుకుంది.

నాలుగో వికెట్‌కు ఏకంగా 221 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును విజపథంలో నడిపించారు. మొదట్లో ఆచితూచి ఆడిన లాథమ్ చివరిలో దంచికొట్టాడు. బౌండరీలతో భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 40 ఓవర్లలో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. శార్థుల్ ఠాకూర్ వేసి ఆ ఓవర్లో ఓ సిక్స్, 4 ఫోర్లను బాదాడు.కెప్టెన్ విలియమ్సన్ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ తో అలరించాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు అలెన్ 22 పరుగులు, కాన్వే 24 పరుగులు చేయగా మిచెల్ 11 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, శార్థుల్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. టీ20 రాణించిన అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఏకంగా 8.1 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీం ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్(77), శుభమన్ గిల్(50) శుభారంభాన్ని అందించారు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. తర్వాత వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు.తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (80) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరివరకు ఉండి టీం ఇండియాను నడిపించాడు. ఇక పంత్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులు చేసి ఔటయ్యాడు. అద్భుత ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ సారి తుది జట్టులో స్థానం దక్కించుకున్న సంజూ శాంసన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివరల్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 37) చెలరేగడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, ఫెర్గ్యూసన్ మూడేసి వికెట్లు తీయగా, మిల్నె ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం హామిల్టన్ వేదికగా జరగనుంది.