india out from t20 world cup
mictv telugu

ప్చ్..వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్..

November 10, 2022

india out from t20 world cup

భారత్ ఆశలు అడియాశలయ్యాయి.ఫైనల్లో పాక్‌ను ఓడించి కప్‌ను ముద్దాడాలనుకున్న ఆశ చచ్చిపోయింది. ఇంగ్లాండ్‎తో జరిగిన సెమీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. కీలక మ్యాచ్‎లో భారత్ బౌలర్లు చేతులెత్తేసారు. 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వికెట్ పడకుండానే కేవలం 16 ఓవరల్లో టార్గెట్‌ను ఇంగ్లాండ్ చేధించింది. బట్లర్, హేల్స్ మన బౌలర్లను ఊతికి ఆరేసారు. ఆరుగురు బౌలర్లను దంచికొట్టారు. సిక్స్ లు,ఫోర్లతో వీరవిహారం చేసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 50), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63) అర్థసెంచరీలతో రాణించగా..రోహిత్ శర్మ 27 పరుగులు చేసాడు. రెండు అర్థసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 14 పరుగుల చేసి కీలక మ్యాచ్‌లో తుస్సు మనిపించాడు. చివర్లో హార్ధిక్ విజృంభించడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డన్ 3, రహీద్ 1, వోక్స్ 1 దక్కించుకున్నారు.

169 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్..భారత్ ఎక్కడా అవకాశమివ్వలేదు. మొదటి ఓవర్ నుంచే భారత్ బౌలర్లను ఊచకోత కోశారు.పోటీపడి బౌండరీలు సాధించారు. 48 బంతులను ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో 47 బంతులను మాత్రమే ఎదుర్కొన్న హేల్స్ 4 ఫోర్లు, 7 సిక్స్ లతో ఏకంగా 86 పరుగులు రాబట్టాడు. ఇంకో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 170 పరుగులు చేసి..ఫైనల్లోకి దూసుకెళ్లింది.