భారత్ మరో నివేదికలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకపడింది. దాతృత్వంపై తాజాగా ప్రకటించిన ‘వరల్డ్ గివింగ్ ఇండెక్స్’ ర్యాంకింగ్స్ నేపాల్, పాకిస్తాన్ దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉంది. గత పదేళ్ల కాలంలో 128 దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్‌కు 82వ స్థానం లభించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి అపరిచితుడికి సాయం చేయగా, ప్రతి నలుగురిలో ఒకరు డబ్బును దానం చేశారు. , ప్రతి ఐదుగురిలో ఒకరు ఇతరుల కోసం స్వచ్ఛందంగా సమయాన్ని కేటాయించారు.
128 దేశాల్లోని 13 లక్షల మంది ప్రజల అభిప్రాయాలను 2010 నుంచి సేకరించి ‘వరల్డ్ గివింగ్ ఇండెక్స్’ ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఎప్పుడైనా అపరిచితులకు ఆర్థిక సహాయం చేశారా? చారిటీ సంస్థలకు సహాయం చేశారా? ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా కృషి చేశారా? లాంటి ప్రశ్నల ద్వారా అధ్యయనకారులు తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. 2010లో వరల్డ్ గివింగ్ ఇండెక్స్‌లో భారత్ 134వ స్థానంలో ఉండగా, గతేడాది గణనీయంగా 81 స్థానానికి చేరుకుంది. మళ్లీ ఈ ఏడాది ఒక స్థానం పెరిగి 82కు చేరుకుంది. నేపాల్ 53వ ర్యాంకులో నిలవగా, పాకిస్తాన్ 69వ ర్యాంకు సాధించింది. అధ్యయన సంస్థ అన్ని విధాల లెక్కలేసి భారతీయులకు దాతృత్వంలో 26 శాతం మార్కులను కేటాయించింది. అదే అమెరికాకు అత్యధికంగా 58 శాతం మార్కులు ఇచ్చింది. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన చైనా కేవలం 16 శాతం మార్కులతో భారత్‌కన్నా ఎంతో వెనకబడింది.