అత్యంత దారుణమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది శ్రీలంక. ప్రధానమంత్రి మహింద రాజపక్సె రాజీనామా తర్వాత తన అధికారిక నివాసం వదిలివెళ్లడంతో ఆయన భారత్కు పారిపోయారని విస్తృతంగా ప్రచారం జరిగింది. రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో లంక అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటడంతో నిరసనకారులపై ఉక్కుపాదం మోపడానికి లంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం, పోలీసులకు విశేష అధికారాలను కట్టబెట్టంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను వెలువరించింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వస్తున్నాయి. శ్రీలంకకు భారత్ మిలిటరీ బలగాలను పంపిస్తున్నదని ఓ వార్త వైరలవుతుంది.
ఈ వదంతులను భారత హైకమిషన్ కొట్టిపారేసింది. శ్రీలంకకు భారత్ తన మిలిటరీ బలగాలను పంపుతున్నదని వస్తున్న వదంతులను ఖండిస్తున్నట్టు పేర్కొంది. అలాంటి ఆలోచనలు భారత ప్రభుత్వం చేయట్లేదని స్పష్టం చేసింది. శ్రీలంక ప్రజాస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని, శ్రీలంకలో మళ్లీ ఆర్థిక స్థిరత్వం నెలకొంటుందని ఆశిస్తున్నట్టు వివరించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిది అరిందమ్ బాగ్చి మంగళవారం శ్రీలంక సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలపై భారత హైకమిషన్ ఈ విధంగా స్పందించింది.