ఓ వైపు ఆకలి.. మరోవైపు అనారోగ్యం.. ఇది చాలదన్నట్లు ప్రకృతి ప్రకోపం.. అఫ్ఘాన్వాసుల పాలిట శాపంగా మారాయి. బుధవారం తెల్లవారు జామున ఆ దేశంలో వచ్చిన భూకంపంతో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారు. 1,500 మందికిపై గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అఫ్ఘాన్ తూర్పులోని ఖోస్ట్ ప్రావిన్స్ పరిధిలోని పాక్ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం పక్టికా కేంద్రంగా భూమి కంపించడంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. రెండు రోజులుగా సరైన తిండి లేదు. ఇక క్షతగాత్రుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే ఈవిపత్తు సమయంలో అఫ్ఘాన్‌ను అన్నివిధాలా ఆదుకుంటామని తొలుత భారత్ పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. ఆహారం, అత్యవసర మందులు, ఇతర పరికరాలు, సహాయ సామగ్రితో కూడిన విమానాలు నిన్న (గురువారం) రాత్రే ఆ దేశ రాజధాని కాబూల్ కు చేరుకునేలా ఏర్పాటు చేశారు.
India, a true first responder. https://t.co/riXkZlzwxC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2022
ఈ మేరకు బాగ్చీ ట్వీట్ చేయగా… దీనిని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ రీట్వీట్ చేశారు. ఈ సహాయ సామగ్రితో పాటు ఒక సాంకేతిక బృందం కూడా కాబూల్ వెళ్లింది. భూకంపంలో దెబ్బతిన్న అఫ్గాన్‌కు తొలుత సాయం పంపిన దేశం భారత్ కావడం విశేషమన్నారు. ఇక భారత్ నుంచి వెళ్లిన బృందంలోని సభ్యులు తాలిబన్లతో కలిసి మనవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. ఈ బృందం అక్కడ ఉన్న భారత దౌత్యకార్యాలయం నుంచి పనిచేయనుంది. దీంతో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. తొలిసారి కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నట్లైంది.