ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న పాకిస్తాన్‌కి పొరుగుదేశం అయిన భారత్ సాయం చేయాలని ఆర్ఎస్ఎస్ నేత కృష్ణ గోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్దికంగా కాకుండా ఆహారపరంగా ఆదుకోవాలని సూచించారు. తిండి లేక సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని, జనాలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశానికి గోధుమలను అందించాలని కోరారు. 70 ఏళ్ల కింద వాళ్లు మనతో కలిసి ఉన్నారని గుర్తు చేశారు. 1948, 1961, 1971, కార్గిల్ యుద్ధాలు చేసినప్పటికీ మానవతా సాయంగా గోధుమలు పంపాలని మెజారిటీ భారతీయులు కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.
అయితే ఆర్ఎస్ఎస్ నాయకుడు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు. అటు ఐఎంఎఫ్ రుణం 1.1 బిలియన్ డాలర్ల రుణం రాకపోవడంతో చైనా ఆపన్నహస్తం అందించి పాక్‌ని ఆదుకుంది. 700 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా అంగీకరించిందని ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. దీంతో ఆ దేశానికి తాత్కాలికంగా భారీ ఊరట లభించినట్టైంది.