చైనాకు భారత్ బిగ్ షాక్స్..కీలక కంపెనీలపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు భారత్ బిగ్ షాక్స్..కీలక కంపెనీలపై వేటు

July 1, 2020

India

జూన్ 15న లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనాకు చెందిన దాదాపు 45 మంది జవాన్లు మరణించినట్టు సమాచారం. అప్పటినుంచి భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేలఁగొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాకు చెందిన 59 మొబైల్ యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసి సంచలనం సృష్టించింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాయింట్‌ వెంచర్లతో సహా రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని అనుమతించమంటూ బుధవారం ఆయన వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

అలాగే అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాకు బిగ్ షాకిచ్చింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్‌సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్‌ నుంచి నిషేధించింది. ‘ఈ రెండు కంపెనీలకు చైనీస్ కమ్యూనిస్ట్‌ పార్టీ, చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో సంబంధాలున్నాయి. ఆ దేశ ఇంటలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఈ రెండు కంపెనీలు చైనీస్ చట్టాలకు లోబడి పనిచేస్తాయి. ఈ రెండు చైనా ఇంటెలిజెన్స్‌ విభాగంకు సహకరిస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి’ అని ఎఫ్‌సీసీ చైర్‌పర్సన్‌ అజిత్‌ పాయ్‌ తెలిపారు. ఈ క్రమంలో భారత్ కూడా రెండు కంపెనీలపై నిషేధం విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హువావే భారతదేశంలోని మొత్తం టెలికం పరికరాల మార్కెట్లో దాదాపు 25 శాతం కలిగి ఉంది. భారతి ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ల కోసం హువావేతో సహా 30 శాతం వరకు చైనా టెలికాం పరికరాలను ఉపయోగిస్తుండగా, వోడాఫోన్ ఐడియా 40 శాతం ఉపయోగిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో టెలివిజన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హువావేకు దేశంలో 5జీ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతినిచ్చారు.