భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఈ దేశాలన్నీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి బెయిలవుట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా వచ్చే నెల 6, 7 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు జరుగునున్నాయి. ‘గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్’ పేరుతో ఈ సదస్సు జరుగనుంది. సదస్సుకు అన్ని జీ-20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. జీ-20 సదస్సులో భాగంగా పలు వాణిజ్య సదస్సులు సైతం జరుగనున్నాయని విదేశాంగశాఖ అధికారి ముక్తేశ్ పరదేశి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారని చెబుతూ ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న దేశాలను ఆదుకునేందుకు భారత దేశం ఓ ప్రణాళికను రూపొందిస్తోందట. చైనా, తదితర రుణదాతలను దీనిలో భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తోందని సదరు మీడియా తెలిపింది. రుణదాతలు ఇచ్చిన రుణాలను ఇటువంటి దేశాల నుంచి తిరిగి రాబట్టుకునేటపుడు కొంత వరకు తగ్గించుకునేవిధంగా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశమట.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. స్నేహపూర్వక పొరుగు దేశాలను ఆహ్వానిస్తున్న భారత్.. ఆ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరు లేదని ‘ఇండియా టుడే’ కథనం నివేదించింది. నిర్వాహకులు ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. ‘‘మేము ఒక సైడ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. జీ 20 ఈవెంట్ ద్వారా ప్రయోజనం పొందే ఇతర దేశాలను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ఉన్న మన స్నేహితులు చాలా మంది ఆ సమావేశంలో పాల్గొంటారు.’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ను ఆహ్వానిస్తారా అని ‘ఇండియా టుడే’ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘స్నేహపూర్వక’ పొరుగు దేశాలను మాత్రమే ఆహ్వానిస్తామని తెలిపారు.