ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్ వివరాలు వచ్చేశాయి. వీటిని గమనిస్తే బీజేపీ 15 ఏళ్ల అధికారానికి తెరపడనుందా? తొలిసారి ఢిల్లీ స్థానిక సంస్థల అధికారం ఆప్ పార్టీకి దక్కనుందా? అనే విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తం 250 వార్డులకు గాను జరిగిన ఎన్నికల్లో ఆప్ పార్టీ 149 నుంచి 171 వరకు సీట్లు దక్కించుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
15 ఏళ్లుగా మునిసిపాలిటీని ఏలుతున్న బీజేపీ 69 నుంచి 91 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని అంచనా వెలువరించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం 3 నుంచి 7 స్థానాలు గెలుచుకొని సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. ఇతరులు 5 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్న ఢిల్లీ ఎన్నికల అధికారిక ఫలితాలు ఈ నెల 7న విడుదల అవుతాయి. అటు సౌత్, ఈస్ట్, నార్త్ మున్సిపాల్టీలు తొలిసారిగా ఏకం అయి ఒకే కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీల్లో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక బీజేపీ బలం గురించి పరిశీలిస్తే.. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా ఎక్కడ గుడిసె ఉంటే అక్కడే ఇల్లు నిర్మించుకోవచ్చనే అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లడం ప్లస్ పాయింట్ గా మారింది. 2017లో 36 శాతం ఓటింగ్ సాధించిన బీజేపీ ఈ సారి కూడా విజయబావుటా ఎగరవేస్తామనే విశ్వాసంతో ఉంది. అటు ఆప్ విషయానికి వస్తే ట్రేడ్ లైసెన్సుల విషయంలో వ్యాపారులు బీజేపీ పట్ల అసౌకర్యంగా ఉన్నారని భావిస్తోంది. అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తామనే హామీని హైలెట్ చేసింది. నగరాన్ని ప్యారిస్, న్యూయార్క్ మాదిరి నిర్మిస్తామని కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఏ మేరకు ఫలితాలను రాబడుతుందో చూడాలి. గత ఎన్నికలో 26 శాతం ఓటింగ్ సాధించిన ఆప్.. ఈ సారి బీజేపీకి చెక్ పెట్టేలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.