India Today published the results of the survey
mictv telugu

ఇండియా టుడే సర్వే.. మోదీ, కేసీఆర్, జగన్‌లకు షాక్

August 12, 2022

India Today published the results of the survey

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు, ప్రజల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే సర్వే నిర్వహించింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి వాటి ఫలితాలను విడుదల చేసింది.

కేంద్రంలో మరోసారి మోదీనే.. కానీ

జాతీయ స్థాయిలో ఓటర్లు మరోసారి ప్రధాని మోదీకే పట్టం కట్టారు. అయితే గతం కంటే ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గుతాయని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో బీజేపికి సొంతంగా 303 సీట్లు రాగా, ఈ సారి మాత్రం కొంత తగ్గి 286 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ప్రధానిగా మోదీనే కావాలని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పుంజుకునే స్థితిలో ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 52 సీట్లు రాగా ఈ సారి ఆ సంఖ్య 146కి చేరుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ప్రధానిగా కేవలం 9 శాతం మాత్రమే బలపరిచారు. మిగతా పార్టీలకు మొత్తం కలిపి 111 సీట్ల వరకు గెలిచే అవకాశముంది. మిత్రపక్షాలు ఎన్డీఏకి దూరం అవుతున్నా కూడా మోదీకి మద్ధతు రావడం గమనార్హం.
ఏపీలో జగన్‌కు కొంత దెబ్బే

గత ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గాను 22 సీట్లు సాధించిన వైసీపీ ఈ సారి 18 సీట్లకే పరిమితమవుతుంది. టీడీపీకి మూడు స్థానాలు ఉండగా, మరో నాలుగు స్థానాలను గెలిచే పరిస్థితి ఉంది. అటు ఇండియా టీవీ చేసిన సర్వేలో వైసీపీకి 19 స్థానాలు వస్తాయని పేర్కొంది. అంటే ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లను చూస్తే 127 సీట్లే వస్తాయి. ఈ సారి ఎలాగైనా మొత్తం 175 స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న జగన్‌కు ఈ పరిణామం కాస్త ఇబ్బంది కలిగించేదే. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏపీలో ఒక్క సీటు రాదని సర్వే పేర్కొంది.
తెలంగాణలో కేసీఆర్‌కు మరింత ఇబ్బంది

కాంగ్రెస్ బలహీనపడడంతో భారీగా పుంజుకున్న బీజేపీకి, అధికార టీఆర్‌ఎస్‌కి మధ్య హోరాహోరీ పోరు నడవబోతోంది. ప్రస్తుతం 9 సీట్లున్న టీఆర్ఎస్ 1 సీటు తగ్గి 8 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీ మాత్రం 3 నుంచి ఆరుకు పెంచుకోనుంది. కాంగ్రెస్ అయితే ఇప్పుడున్న సీట్లే సాధిస్తుందని వెల్లడైంది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ లోపు మునుగోడు ఎన్నికలు సెమీఫైనల్‌గా మారనుండడంతో ఏమి జరుగుతుందోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే మెజారిటీ ప్రజల మద్ధతు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆయా పార్టీలు పుంజుకోవడానికి ఏమి చేస్తాయో చూడాల్సి ఉంది.