India vs Australia 1st ODI : India won 5 wickets,KL Rahul, Ravindra Jadeja lead
mictv telugu

బ్యాట్‎తోనే రాహుల్ సమాధానం.. మొదటి వన్డేలో ఆసీస్‎పై భారత్ గెలుపు

March 17, 2023

India vs Australia 1st ODI :India won 5 wickets,KL Rahul, Ravindra Jadeja lead

భారత్ లక్ష్యం 189. పైగా సొంతగడ్డపై ఆడుతోంది. ఇట్టే స్వల్ప లక్ష్యాన్ని చేధించేస్తారని భారత్ అభిమానులు అందరూ భావించారు. ఇంతలోనే షాక్ తగిలింది. బ్యాటింగ్ మొదలు పెట్టారో లేదు వరుస పెట్టి 3 వికెట్లు కోల్పోయింది. డబుల్ సెంచరీ తర్వాత పెద్దగా ప్రభావం చూపని ఇషాన్ కిషాన్(3), ఆస్ట్రేలియాపై భయంకరమైన రికార్డుల ఉన్న కోహ్లీ(4), పొట్టి ఫార్మెట్‌లో తప్పా..వన్డేలు, టెస్ట్‌ల్లో ప్రభావం చూపలేడనే పేరున్న సూర్యకుమార్ యాదవ్(0) క్షణాల్లో ఔటైపోయారు. నిలబడినట్లు కనిపించిన గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 39 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది భారత్. ఇక కష్టమే అనుకున్న సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇంతలోనే 25 పరుగులు చేసిన హార్దిక్ ఔటవ్వడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. అయితే ఆస్ట్రేలియాకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75), జడేజా (69 బంతుల్లో 45) మ్యాచ్‌ను ముగించేశారు. చివరికి భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. స్టార్క్ 3 వికెట్లు తీసి భారత్ ను భయపెట్టగా, స్టోయినీస్ 2 వికెట్లు తీశాడు.

బ్యాట్‎తోనే సమాధానం

గత కొంతకాలంగా దారుణ ప్రదర్శనలు. తీవ్రమైన విమర్శలు. పేలవ ఫామ్‌తో ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీ రెండు మ్యాచ్‎లకు దూరం. అయినా కుంగిపోకుండా అన్ని విమర్శలకు బ్యాట్‎తోనే సమాధానమిచ్చాడు కేఎల్ రాహుల్. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తప్పక నిలబడాల్సిన సమయంలో నిలబడి అజేయ అర్థసెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడినా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు రాహుల్. నాలుగో వికెట్‌కు గిల్‌తో 23,ఐదో వికెట్‌కు పాండ్యాతో 44, ఆరో వికెట్‌కు జడేజాతో కలిసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. మరోసారి తన విలువ ఏంటో చాటి చెప్పాడు. గాయం నుంచి కోలుకోని అద్భుతంగా రాణిస్తున్న జడేజా వన్డేలో కూడా తన ఫామ్‎ను కొనసాగించాడు. మరోసారి తన కీలక ఇన్నింగ్స్‌తో భారత్ ను గట్టెక్కించాడు.

విజృంభించిన భారత్ బౌలర్లు

అంతకుముందు భారత్ బౌలర్లు విజృంభించడంతో కంగారులు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 129/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా కేవలం 60 పరుగుల తేడాలోనే 7 వికెట్లు కోల్పోయింది. షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా జడేజా 2, పాండ్యా, కుల్దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో 65 బంతుల్లో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్. ఇంగ్లీష్ 26, స్మిత్ 22 పరుగులు చేశారు.