ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో భారత్ బౌలర్లు అదరగొట్టారు.షమీ, సిరాజ్, జడేజా ధాటికి కంగారులు 188 పరుగులకే చేతులెత్తేశారు. దీంతో భారత్‌కు ఆసీస్ 189 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.129/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా కేవలం 60 పరుగుల తేడాలోనే 7 వికెట్లు కోల్పోయింది. షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా జడేజా 2, పాండ్యా, కుల్దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో 65 బంతుల్లో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్. ఇంగ్లీష్ 26, స్మిత్ 22 పరుగులు చేశారు.
మిచెల్ మెరుపులు
టాస్ గెలిచిన టీం ఇండియా మొదట ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌ను హెడ్, మార్ష్ ప్రారంభించగా ఆ జట్టుకు రెండో ఓవర్ లోనే సిరాజ్ షాకిచ్చాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత స్మిత్, మిచెల్ మార్ష్ జోడి మరో వికెట్ పడకుండా ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపించింది. స్మిత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తే..మిచెల్ మార్ష్ మాత్రం చెలరేగాడు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 72 పరుగులు చేశారు. చేశారు. హార్దిక్ బౌలింగ్‌లో స్మిత్ కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ ఔటయ్యినా మిచెల్ దూకుడు కొనసాగించాడు. మూడో వికెట్‌కు 52 పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ ఔటయ్యాక ఆసీస్ పరిస్థితి మారిపోయింది. భారత్ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 200లోపే ఆలౌట్ చేశారు.