బోర్డర్ – గావస్కర్ ట్రోఫిలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో 50 పరుగులు చేసింది. ఓపెనర్ల డేవిడ్ వార్నర్(42 బంతుల్లో 15), ఉస్మాన్ ఖవాజా (43 బంతుల్లో 29) క్రీజ్‌లో ఉన్నారు. మొదటి టెస్ట్ అనుభవం దృష్ట్యా ఈసారి పరుగులపై కాకుండా కేవలం క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత క్రమంగా జోరు పెంచుతున్నారు.
సూర్య స్థానంలో అయ్యర్
రెండో టెస్ట్‌లో టీం ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్స్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. ఆస్ట్రేలియా టీంలో రెండు మార్పులు కనిపించాయి. బోలాండ్ స్థానంలో మాథ్యూ కునెమన్, రెన్ షా స్థానంలో హెడ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
పుజారా 100వ టెస్ట్
టీం ఇండియా బ్యాట్స్‌మెన్ పుజారా తన కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. 13 ఏళ్లగా సుదీర్ఘంగా ఆడుతున్న పుజారా కెరీర్‌లో మాత్రం నేటి మ్యాచ్ వెరీవెరీ స్పెషల్. మ్యాచ్ కు ముందు వందో టెస్ట్ ఆడుతున్న పుజారాకు గావస్కర్ ప్రత్యేక క్యాప్ అందించారు. టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన 13వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ టెస్టులో పుజారా సెంచరీ సాధిస్తే 100వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.