బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు అంతా సిద్ధమైంది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇక ఇప్పటికే రెండు విజయాలతో ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్… సిరీస్ క్వీన్‌స్లీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఈ సిరీస్‌తోపాటు ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంటుంది టీమిండియా. అటు పర్యాటక జట్టు ఆస్ట్రేలియా మాత్రం సమస్యలతో సతమతమవుతోంది. వరుస ఓటములకు ముగింపు పలకాలని భావిస్తోంది.
అయితే మొదటి రెండు టెస్టులు దాదాపుగా మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. క్యూరేటర్లు పూర్తిగా స్పిన్ పిచ్‌లను తయారు చేస్తూ బౌలర్లు, బ్యాటర్లకు ముప్పతిప్పలు పెడుతున్నారు. అయితే పిచ్‌ల నాణ్యతపై ఆస్ట్రేలియా బహిరంగంగానే విమర్శలు చేసింది. ఈ పిచ్లు భారత స్పిన్నర్లకు అనుకూలంగానే తయారు చేశారంటూ ఆరోపణలు చేసింది.
ఓటమి భారంతో కుంగిపోతున్న ఆసీస్ ఇండోర్ టెస్టులో గెలవాలనే కసితో ఉంది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టులోకి రావడంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ ఇద్దరు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా స్వదేశంలోనే ఉండిపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇక టీమిండియా స్పిన్నర్లైతే అశ్విన్, జడేజాలు మొదటి మ్యాచ్ నుంచి అదరగొడుతున్నారు. ఆసీస్ను దెబ్బతీస్తున్నారు. అయితే మన స్పిన్నర్లే కాదు ఆసీస్ స్పిన్నర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్లు కూడా వికెట్లు పడగొట్టారు.