బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్‌లో భారత్ చేతులెత్తేసింది. తొలి రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన ఆటగాళ్లు ఇండోర్‌లో మాత్రం చతికిలపడ్డారు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. పుజారా(59) అర్థసెంచరీతో ఆదుకోవడం భారత్ ఆ మాత్రం పరుగులు చేసింది. ఆస్ట్రేలియాన్ స్పిన్నర్ ఏకంగా 8 వికెట్లు తీసి భారత్ కొంపముంచాడు. స్టార్క్, కునెమన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. భారత్ ఆలౌట్ అయ్యాక మూడోరోజు ఆటను నిలిపివేశారు.
లియాన్ విజృంభణ
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై లియాన్ విజృంభించాడు. ఏకంగా ఎనిమిది వికెట్లు సాధించి ఆస్ట్రేలియా జట్టుకు విజయం ముంగిట నిలిపాడు. లియాన్ దెబ్బకు మొదట
రోహిత్, గిల్, కోహ్లీ జడేజ్ వంటి కీలక ఆటగాళ్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. తర్వాత క్రీజ్‌లో పాతుకుపోయి జట్టును ముందుకు నడిపిస్తున్న పుజారాను పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పుజారా అయ్యాక స్వల్ప వ్యవధిలోనే ఉమేష్ యాదవ్, సిరాజ్‌లను ఔట్ చేశాడు.
నిలిచిన పుజారా
ఆసీస్‌ను మొదట ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ చేసిన సంతోషం భారత్‌కు ఎక్కువసేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. రాహుల్ స్థానంలో వచ్చిన గిల్ అతడి బాటలోనే పయనించాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ దారుణంగా విఫలమయ్యారు. 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పుజారా, అయ్యర్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అయ్యర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 35 పరుగులు చేశారు. ఈ క్రమంలో అయ్యర్ (26, 27 బంతుల్లో) స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పుజారా చాపకింద నీరులా పరుగులను సాధించాడు. 107 బంతుల్లో అర్థసెంచరీని సాధించాడు.చివరికి 59 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరడంతో..భారత్ వరుస వికెట్లను కోల్పోయి ఆలౌట్ అయ్యింది.