అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత్ – ఆసీస్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ 486/5 స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ (128), విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (145*), అక్షర్ పటేల్ (44*) ఉన్నారు. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో టెస్టు శతకం నమోదు చేశాడు. ఇటీవల వన్డేలు, టీ20ల్లో శతకాలు బాది కమ్ బ్యాక్ చేసిన కోహ్లీ తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన శతకం బాదాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 28వ శతకం కాగా, ఓవరాల్ గా విరాట్ ఇంటర్నేషనల్ కెరీర్ లో 75వ సెంచరీ మార్క్ చేరుకున్నాడు.
భారత్ కు కీలకమైన మ్యాచ్ కావడంతో నిలకడగా ఆడిన కోహ్లీ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ తడబాటు లేకుండా క్రీజులో నిలిచి, 241 బంతుల్లో దాదాపు మూడున్నరేళ్ల తరువాత టెస్టు శతకం నమోదు చేశాడు కోహ్లీ. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో టెస్ట్ ఫార్మాట్ లోనూ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
సెంచరీల మీద సెంచరీలు నమోదు చేసే కోహ్లీకి ఈ టెస్ట్ శతకం చేయడానికి 41 టెస్టు ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. తాజా శతకం కోహ్లీ కెరీర్ లో రెండో నెమ్మదైన టెస్ట్ శతకం. గతంలో ఇంగ్లాండ్ జట్టుపై 289 బంతుల్లో చేసిన సెంచరీనే స్లో సెంచరీ. కాగా, ఆ తరువాత నేడు నాలుగో టెస్టులో ఆసీస్ తో మ్యాచ్ లో చేసిన శతకానికి సైతం కోహ్లీ అధిక బంతులను ఎదుర్కొన్నాడు. కోహ్లీ చివరగా 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ చేశాడు. తాజా శతకానికి మూడున్నరేళ్లు పైగా వేచి చూశాడు. మొదటి 25 సెంచరీలు అందుకోవడానికి 184 ఇన్నింగ్స్‌లు తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 26 నుంచి 50 సెంచరీలు అందుకోవడానికి 164 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. 51 నుంచి 75 సెంచరీలను చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి 204 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి…
స్వదేశంలో కోహ్లీకి ఇది 14వ టెస్ట్ సెంచరీ. భారతదేశం తరపున స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్ లను కోహ్లీ అధిగమించాడు. సుదీర్ఘ కాలం అనంతరం టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాట్ ఎత్తి అభిమానులకు అభివాదం చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.