India vs Bangladesh 2nd ODI match Today: When and where to watch
mictv telugu

నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా డు ఆర్ డై మ్యాచ్

December 7, 2022

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా…రెండో వన్డే కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైతే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను భారత జట్టు చేజార్చుకోనుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సత్తా చాటాలని రోహిత్‌ సేన కోరుకుంటోంది. రెండో వన్డే బుధవారం మిర్‌పూర్‌ వేదికగా ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని టీమిండియా కోరుకుంటోంది.

తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత్ చేజేతులా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో కేవలం 186 పరుగులే చేసి ఆలౌట్ అయింది. తొలి వన్డేలో చేసిన తప్పులను సరి చేసుకుని రెండో వన్డేలో రెచ్చిపోవాలని పట్టుదలగా ఉంది టీమిండియా. కెప్టన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్ బ్యాటును ఝళిపిస్తే భారీ స్కోరు సాధించాలనే వ్యూహంతో ఉన్నారు.

తొలివన్డేలో బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తిసినా.. భారత బౌలర్లు మాత్రం ఆకట్టుకున్నారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అరంగేట్ర వన్డేలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్న కుల్దీప్ సేన్‌కు మరో అవకాశం ఇస్తారా..? లేదా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌లో తీసుకువస్తారానేది చూడాలి. మరోవైపు మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని చేజిక్కించుకున్న బంగ్లాదేశ్ కూడా జోరుమీదుంది.

భారత్ జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కుల్దీప్ సేన్/ఉమ్రాన్ మాలిక్