మరికొన్ని గంటల్లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగుతుండటంతో.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసే అవకాశం ఉందని కొంతమంది ఆన్లైన్లో టికెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో కొంతమందికి మాత్రమే టికెట్ దొరుకుతుండగా.. మరికొంతమందికి నిరాశ ఎదురవుతోంది. దీంతో వారు బ్లాక్ టికెట్ల దందాను ఆశ్రయిస్తున్నారు.
ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన కొంతమంది.. ఆఫ్‌లైన్‌లో వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఆన్లైన్లో రూ.1250 విలువ గల టికెట్‌ను బయట రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. డబ్బులు సొమ్ము చేసుకునేందుకు కొంతమంది బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. నేరుగా ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా మొదలుపెట్టారు. దీంతో పోలీసులు నిఘా పెట్టి బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 54 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
మ్యాచ్ క్రమంలో బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బ్లాక్‌లో టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇక ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి తొక్కిసలాట, గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.