భారత్ – న్యూజిలాండ్ చివరి టీ 20 మ్యాచ్ నేడు. ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ కీలక మ్యాచ్.. సిరీస్ ఎవరిదో తేల్చనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరి ఒక మ్యాచ్ గెలిచి చెరొక పాయింట్ తో సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ దక్కుతుంది. తాజా ఫామ్, జట్లను చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
ఆచితూచి ఆడితేనే..
ఈ ఏడాదిలో వరుసగా మూడు సిరీస్‌లను గెలిచిన భారత్.. నాలుగో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంది. కానీ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. ఇక రెండో టీ20లో కూడా పెద్దగా సాధించిందేమీ లేదు. చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో హార్థిక సేన ఆచితూచి ఆడక తప్పదు. వచ్చిన అవకాశాలను శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌తోపాటు రాహుల్ త్రిపాఠి సద్వినియోగం చేసుకోవాలి. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగ్గా రాణిస్తే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో భారత తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. లక్నోలాంటి టర్నింగ్ పిచ్ కాకపోవడంతో మళ్లీ చహల్ స్థానంలో ఉమ్రాన్ జట్టులోకి రావచ్చు.
గెలిచే అవకాశముంది
ఇక న్యూజిలాండ్ జట్టు 2012లో చెన్నైలో జరిగిన ఏకైక టి20లో భారత్‌ను ఓడించింది. అది మినహా 1955 నుంచి ఏ ఫార్మాట్‌లో కూడా మన గడ్డపై ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే తమ జట్టు ఆ అరుదైన ఘనత అందుకోగలదని కివీస్ ఆశిస్తోంది. టీమ్‌లో కాన్వే జోరు మీదుండగా, ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తగిన సహకారం అందుతోంది. అలెన్, ఫిలిప్స్ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా.. ఆల్‌రౌండర్లు బ్రేస్‌వెల్, మిచెల్ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు సాన్‌ట్నర్, ఇష్ సోధి భారత లైనప్‌ను కట్టిపడేయగల సమర్థులు. వ్యక్తిగతంగా గొప్ప ఘనతలు లేకపోయినా… సమష్టిగా తమ జట్టు బలమైందని ఎన్నోసార్లు నిరూపించిన న్యూజిలాండ్ మళ్లీ అదే పట్టుదలను చూపిస్తే ఈ సిరీస్ గెలిచే అవకాశముంది.