న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జనవరి 18న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు నగరానికి వస్తుండగా, 15న ప్రాక్టీస్ చేయనుంది. భారత జట్టు 16న చేరుకోనుండగా, 17న ఇరు జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచుపై హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభిమానుల కోసం టిక్కెట్లను ఈ నెల 13 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. ఆన్ లైన్లో పేటీఎంలో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. అయితే ఫిజికల్ టిక్కెట్లను మాత్రం ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవాలని సూచించారు. మొత్తం టిక్కెట్లు 39 వేల 112 ఉండగా, అందులో కాంప్లిమెంటరీ టికెట్లు 9 వేల 695 ఉన్నాయి. ఇవి పోగా మిగిలిన 29 వేల 417 టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులో ఉండనున్నాయి.