ఐసీసీ రెండేళ్లకోసారి నిర్వహిస్తోన్న మహిళల టీ20 ప్రపంచకప్ ఈ నెల 10న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో సౌత్ అఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడగా.. రసవత్తరమైన ఆ ఆటలో 3 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. ఇక ఈ రోజు దాయాదులు పోరు జరుగనుంది. సాధారణంగా టీమిండియా, పాకిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయంటేనే అభిమానుల్లో అంచనాలు అంతకుమించి అన్నట్లుగా పెరిగిపోతాయి. ఇక ప్రపంచకప్‌లో అంటే ఏ రేంజ్ లో ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయ్ స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
కాకపోతే ఈ మ్యాచ్‌కి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వేలి గాయం కారణంగా దూరమవడం జట్టును కొంచెం ఇరకాటంలో పడేసింది. అయినా మేమున్నాం అంటూ… కెప్టెన్ హర్మన్ ప్రీత్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా… తమ బ్యాట్‌లను ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. బౌలింగ్‌లో పేసర్ రేణుక సింగ్, వెటరన్ పేసర్ శిఖా పాండే, ఏపీ అమ్మాయి అంజలి శర్వాణి, పుజా వస్త్రాకర్‌లు కూడా.. సఫారీ పిచ్‌లపై ఫాస్ట్‌బౌలింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు సౌత్ ఆఫ్రికా దేశం కేప్ టౌన్ సిటీ లోని న్యూలాండ్స్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. రెండింట్లో పాక్ గెలిచింది. మొత్తంగా టీ20ల్లో రెండు జట్లు 13 సార్లు తలపడగా.. భారత్ 10, పాక్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గాయి.