శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ప్రస్తుతం పటిష్టస్థితిలో నిలచింది. 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అదరిపోయే ఆరంభాన్ని అందించిన ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. స్వల్ప వ్యవధిలో రోహిత్, గిల్ ఔటయ్యారు. 143 పరుగుల వద్ద అర్థసెంచరీ సాధించి మంచి ఊపులో ఉన్న గిల్(60 బంతుల్లో 70) శనకా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కాసేపటికే 173 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. 67 బంతుల్లో 83 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను మధుశనక బౌల్డ్ చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ(22 బంతుల్లో 29), శ్రేయస్ అయ్యర్ (19 బంతుల్లో 20 పరుగులు) క్రీజ్‌లో ఉన్నారు.
రోహిత్ కొత్త ఫీట్
గిల్‌తో కలిసి జట్టుకు సెంచరీ భాగ్యస్వామ్యం అందించిన రోహిత్ కొత్త ఫీట్ ను అందుకున్నాడు. ఓపెనర్ గా 27 సార్లు శతక భాగస్వామ్యం అందించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో శిఖర్ ధావన్‌తోనే 18 సార్లు కావడం విశేషం. కేఎల్ రాహుల్ తో ఐదు సార్లు, అజింక్య రహానెతో మూడు సార్లు, గిల్ తో మొదటి సారి రోహిత్ శతక భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడు.