శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేయడమే ఓ రికార్డ్ కాగా.. వన్డే చరిత్రలోనే (ఆఖరి వన్డేలో) భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమ్ఇండియా అవతరించింది. శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వన్డే మ్యాచ్‌లో ఇంత భారీ స్కోరు తేడాతో వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది టీమిండియా. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (166*: 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు)తోపాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (116: 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో అదరగొట్టారు. లంక బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసేసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలు బాదడం విశేషం.
హాఫ్ సెంచరీ తర్వాత వేగం పెంచిన కోహ్లీ 106 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. భారత గడ్డ మీద తక్కువ బంతుల్లో 150 స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (42), అయ్యర్ (38), రాహుల్ (7), సూర్య (4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భారత్ దుమ్ములేపింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. అతని పేస్ దెబ్బకు టపటపా వికెట్లు కోల్పోయింది. కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చరిత అసలంక (1)లను సిరాజ్ అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లో లంక కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా గెలుచుకుంది.
• మొత్తంగా ఈ మ్యాచ్ ఎన్నో రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా ఇంతకుముందున్న రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీతో (166; 110 బంతుల్లో) స్వదేశంలో అత్యధిక సెంచరీలు (21) బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు కోహ్లీ. ఇన్నాళ్లూ ఈ రికార్డు సచిన్ (20) పేరిట ఉంది.
• వన్డేల్లో కోహ్లీకిది రెండో అత్యధిక స్కోరు (166; 110 బంతుల్లో). అంతకుముందు 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు అతడి అత్యధిక స్కోరు.
• వన్డేల్లో శ్రీలంకపై కోహ్లీకిది 10వ సెంచరీ. ఈ శతకంతో వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ (వెస్టిండీస్‌పై 9) రెండో స్థానంలో ఉన్నాడు.
• ఈ ఫార్మాట్లో వేగవంతమైన (106 బంతుల్లో) 150 అందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఇషాన్ కిషన్ (103 బంతుల్లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు.
• ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (12754) ఐదో స్థానంలో ఉన్నాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు.
• ఈ మ్యాచ్‌లో కోహ్లీ 8 సిక్స్‌లు బాదాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో అతడి అత్యధిక సిక్స్‌లు ఇవే.
• వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే (317) భారీ విజయం. గతంలో (ఐర్లాండ్‌పై 290) న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.
• ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్ సిరాజ్ కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డేల్లో (4/32) ఎక్కువ వికెట్లు తీసి, అత్యుత్తమ బౌలింగ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు.
• వన్డేల్లో శ్రీలంకకు ఇది (73) నాలుగో అత్యల్ప స్కోరు.
• 50 ఓవర్ల ఫార్మాట్లో శ్రీలంకపై భారత్ నాలుగో (390/5) అత్యధిక స్కోరు ఇది.
• శ్రీలంక ఆటగాడు అవిష్క ఫెర్నాండో ఈ సిరీస్‌లో మూడు సార్లు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
• అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్న ఆటగాళ్లలో కోహ్లీ(10) మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో సచిన్(15), రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య(11) కొనసాగుతున్నాడు. కోహ్లీ కేవలం 66 సిరీస్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
• వన్డేల్లో 150కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లలో సచిన్, గేల్‌తో కలిసి కోహ్లీ(5) మూడోస్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్(8), డేవిడ్ వార్నర్(6) స్థానాల్లో ఉన్నారు.
• ఈ ఫార్మాట్లో శ్రీలంకపై అత్యధిక అర్ధసెంచరీలు చేసిన వ్యక్తుల్లో ధోనీతో కలిసి కోహ్లీ(21) రెండో స్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో సచిన్(25) ఉన్నాడు